Admin Login
Language:

ఒత్తిడి లేని విద్యతో ఆత్మహత్యల నివారణ.

April 27, 2026 Ambati Net World
[ Responsive Header Ad Slot ]
ఒత్తిడి లేని విద్యతో ఆత్మహత్యల నివారణ.

'జాతీయ నేర గణాంక సంస్థ' (ఎన్‌సిఆర్‌బి) నివేదిక ప్రకారం 2014లో 8032 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 30 శాతం మంది కేవలం పరీక్షలలో ఫెయిల్‌ అయినందునే బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2015లో దేశం మొత్తం మీద జరిగిన 8,423 విద్యార్థి ఆత్మహత్యలలో 333 రాష్ట్రానికి చెందినవే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు వెలువడగానే సుమారు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. సమస్య తీవ్రతను గుర్తించి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ముఖ్యంగా పరీక్ష నిర్వహణ సంస్థలు పరీక్షల నిర్వహణ నుంచి మూల్యాంకనం, ఫలితాల ప్రకటన వరకు పారదర్శకంగా ఎంతో జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం వుంది.

విద్య ముఖ్య ఉద్దేశం విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి అయినా ఎదుర్కొనే విధంగా, వారి మానసిక స్థైర్యాన్ని పెంచి, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విధంగా ఉండాలి. కాని నేటి పరిస్థితి మార్కులు సాధించడమే లక్ష్యంగా, అదే జీవిత పరమావధిగా తయారైంది. ప్రయివేటు విద్యా సంస్థల 'పోటీ' భావజాల పుణ్యమే ఇదంతా. దాంతో తల్లిదండ్రులు కూడా పిల్లల అభీష్టాలకు భిన్నంగా ఎంపిసి, బైపిసి గ్రూపులు మాత్రమే చదివించి ఇంజనీర్లు, డాక్టర్లుగా చూడాలనుకుంటున్నారు.

ఒక చేపను తీసుకొచ్చి చెట్టు ఎక్కడంలో పరీక్ష పెడితే, అది జీవితాంతం పరీక్ష తప్పుతుంది. అదే చేప ఈత పరీక్షలో విజయం సాధిస్తుంది. ఎందుకంటే అది దాని స్వభావం. అదేవిధంగా ప్రతి ఒక్కరిలోనూ తమదైన ప్రత్యేకత వుంటుంది. వారికి సహజంగా కొన్ని అభిరుచులు ఉంటాయి. ఆ అభిరుచులను వెలికితీసి, అందులో శిక్షణ ఇస్తే, తప్పనిసరిగా ఉన్నత శిఖరాలను అందుకుంటారు. కాబట్టి మన విద్యావ్యవస్థ విద్యార్థుల అభిరుచులను వెలికితీయగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.
రెండవది విద్యార్థుల సామర్థ్యాన్ని మార్కులతో కొలవడం, శాస్త్రీయం కాదు. 98 మార్కులు, 99 మార్కులు వచ్చిన విద్యార్థులను సామర్థ్యం పరంగా మార్కులతో ఎలా బేరీజు వేస్తారు? కాని ఈ మార్కులు నెంబర్‌వన్‌ ర్యాంకుకు ప్రాతినిథ్యం వహిస్తాయి.

ఒక్క మార్కులో ర్యాంకు మిస్‌ అయ్యిందని విద్యార్థి ఒత్తిడికి గురయ్యే అవకాశం కల్పిస్తాయి. ఇలా ఒత్తిడికి లోనైన విద్యార్థిని ఓదార్చడానికి గతంలో లాగా ప్రస్తుత సమాజంలో ఉమ్మడి కుటుంబాలు లేవు. దీంతో సహజంగా విద్యార్థుల్లో ఒంటరి భావం పెరిగి ఆత్మన్యూనతాభావానికి దారితీస్తోంది. దీంతో క్రమంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే ఇటువంటి పరిస్థితుల్లో ఒత్తిడికి గురైన పిల్లలను తల్లిదండ్రులు వెంటనే మానసిక వైద్యులకు చూపించి చికిత్స చేయించాలి. నామోషీగా భావించకూడదు. ఈ విషయమై విద్యా సంస్థలు, తల్లిదండ్రులు, విద్యార్థులలో మార్పు తేవడానికి కృషి చేయాలి. అయితే మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశంలో మానసిక వైద్య నిపుణుల కొరత చాలా తీవ్రంగా వుంది.

విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు అటు ప్రభుత్వం, ఇటు సమాజం పరస్పర సమన్వయంతో, సహకారంతో, నిబద్ధతతో కృషి చేయాలి.

[ Bottom Related Article Ad Slot ]