Admin Login
Language:

స్వీయ జనగణనలో పాల్గొనండి

April 27, 2026 Ambati Net World
[ Responsive Header Ad Slot ]

* http://se.census.gov.in పోర్టల్‌లో లాగిన్‌కండి
* అక్షరాస్యులకు కరీంనగర్‌ కలెక్టర్‌ చిత్రామిశ్రా పిలుపు

దేశంలో మొదటిసారిగా అమల్లోకి తెచ్చిన స్వీయ జనగణనలో అక్షరాస్యులంతా పాల్గొని విజయవంతం చేయాలని కరీంనగర్‌ కలెక్టర్‌ చిత్రామిశ్రా పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో స్వీయ జనగణన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ విధానంతో ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలు స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సులభంగా, సురక్షితంగా, పారదర్శకంగా చేసుకోవచ్చని, నేటి నుంచి మే 10 వరకు సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ కొనసాగుతుందన్నారు. ఈ గణనలో గృహ స్థితి, వసతులు, మతం, షెడ్యూల్‌ కులాలు, తెగలు, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి వసతి, వంట ఇంధనం లాంటి 34 అంశాలపై సమాచారం సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ డేటా దేశ ప్రణాళిక, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

http://se.census.gov.in పోర్టల్‌లో మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అయి, గృహాన్ని జియో ట్యాగ్‌ చేసి వివరాలు నమోదు చేయవచ్చన్నారు. నమోదు పూర్తయ్యాక H అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ఐడీ జనరేట్‌ అవుతుందని, సుమారు 15 నుంచి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చన్నారు. నమోదు అనంతరం వచ్చే ఐడీని ఎన్యూమరేటర్‌కు చూపిస్తే, అధికారులు వివరాలను ధ్రువీకరిస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్య, బ్యాంకు సిబ్బంది, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, తదితరులు ప్రజలను ప్రోత్సహించే బాధ్యతలు చేపట్టారని, గ్రామాల్లో తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచడంతోపాటు భద్రపరుచనున్నట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌డీవో కే మహేశ్వర్‌, సీపీవో, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

[ Bottom Related Article Ad Slot ]